పుట:హరివంశము.pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

466

హరివంశము

     బర్వతనిర్ఝరంబులం గడుగుచోటం బ్రక్కలు రెండును రాళ్లు సోఁకి చిఱునెత్తురు
     వెడలి కంది యజతనుచ్ఛాయంబు లగుటం జేసి యజపార్శ్వుం డను పేరు పెట్టి.11
క. వేమకుఁ డనుమునిపతికిం, బ్రేమముతో నిచ్చుటయును బెనిచె నతం డు
     ద్దామనవయౌవనంబున, భూమీశ్వరుఁడై కుమారపుంగవుఁ డెలమిన్.12
వ. ఆవిప్రుల నిద్దఱం దనకు మంత్రులంగాఁ గైకొనియె నన్నరనాయకునకు నమా
     త్యులకునుం బుత్రపౌత్రు లనేకులు గలిగి తుల్యంబుగాఁ జిరకాలంబు బ్రతికి
     రిట్లు పూరుండు మొదలుగా నవిచ్ఛిన్నం బై వచ్చిన పాండవవంశంబు జగంబున
     సుప్రతిష్ఠితం బై యిప్పుడు వెలయుచున్నది యని యవ్విధంబున నహుషసూతి
     యగు యయాతి చెప్పిన శ్లోకం బొక్కటి గల దది యె ట్లనిన13
క. రవిశశితారలు వెలిగా, దివి యున్నను నుండుఁగాని తెల్లంబుగఁ బౌ
     రవవంశము లేకుండుట, భువి నెందును లేదు కాలములు దగ మూఁటన్.14
వ. అనియె నని చెప్పిన సూతునకు శౌనకాదిమహామును లి ట్లనిరి.15
సీ. జన మేజయునకు వైశంపాయనుఁడు వాగ్మివిభుఁ డాదరంబున విస్తరించి
     నట్టి మార్గంబున హరివంశకథనంబు సర్వంబు నితిహాసపూర్వకముగ
     నీ వుపన్యాసంబు గావింప వీనుల కమృతంపుసోన లై యమర నేము
     వింటిమి నెఱయంగ గంటిమిఁ గాంక్షితసిద్ధిఁ బుణ్యము లెల్లఁ జేరె మాకు
తే. ననఘ భారతాఖ్యానంబు నచ్యుతాన్వయప్రశంసయు వినినయనంతరంబ
     యాపరీక్ష్మిత్తనూజుఁ డుదాత్తచిత్తుఁ, డేమి యొనరించె నవ్విధం బెఱుఁగఁ జెపుమ.16
వ. అని యడిగిన నతండు వారల కి ట్లనియె జనమేజయుండు సర్పసత్రానంతరంబ
     ఋత్విక్పురోహితాచార్యులం బిలిచి.17
క. హయమేధ మే నొనర్చెదఁ, బ్రియమునఁ బనుపుఁడు సమస్తపృథివిం ద్రిప్పన్
     హయరత్నము ననుటయు న, ట్ల యియ్యకొని నిర్మలప్రతిభమెయిన్. 18

శ్రీ వేదవ్యాసమునీంద్రుండు జనమేజయునకు ననాగతంబు చెప్పుట

వ. సంభృశప్రారంభు లైన యనంతరంబ.19
శా. వేదజ్ఞుండు ద్రిలోకవేది ధృతసంవిత్సంప్రమోదుం డని
     ర్వేదుం డప్రతిమప్రభావుఁడు తపోవిద్యానవద్యాత్మకృ
     త్యోదీర్లుం డవిదీర్ణధర్ముఁడు సదద్యుక్తుండు యుక్తుండు శ్రీ
     వేదవ్యాసమునీశ్వరుండు గరువ న్విచ్చేసె నచ్చోటికిన్.20
క. మునివరు నంతంతం గని, జనపతి పరిజనముఁ దాను సంప్రీతి నెదు
     ర్కొని యర్ఘ్యపాద్యముఖ్యా, ర్చనములఁ బరితుష్టుఁ జేసి సవినయబుద్ధిన్.21
వ. కొంతసే పుచితవాక్యసంవాదంబునం బ్రమోదించి పదంపడి యమ్మహాత్ముతో
     ని ట్లనియె.22
శా. సర్వామ్నాయపురాణశాస్త్రపదవీసంభావితార్థస్థితుల్
     నిర్వాహంబునఁ బొంద సర్వకవితానిర్బంధముం బూర్ణమై