పుట:హరివంశము.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

412

హరివంశము

వ. వైశాఖశుద్ధద్వాదశినాటిరాత్రి హర్మ్యతలంబున సుప్త యైననిన్ను ననుభా
     వ్యభావరససంస్కారం బగుభావసంభవవికారంబు నొందించినవాఁడ వల్లభుం
     డగు నని యద్దేవి నిర్దేశం బిప్పుడ ఫలియించె నీవు పరితోషంబు కొందు మనిన
     నయ్యిందుముఖి ముఖంబు మంచుదొరంగినయిందుబింబంబుపగిది నవగతబాష్ప
     పూరం బై భూరికాంతి వహించె నెచ్చెలు లెల్ల నుల్లాసంబు నొంది రనంతరంబ
     యయ్యబల ప్రియసఖిం గనుంగొని యల్లన యి ట్లనియె.114
క. భ్రమ వాయఁజేసి యిటు మా, నము గ్రమ్మఱఁ జెలియ నీవు నా కిచ్చితి వీ
     సమధిక మగుభాగ్యము భో, గ్యముగా నొడఁగూడుత్రోవ యరయుమ యింకన్.115
క. మనసున నాడెడునయ్యన, ఘునియాకృతి యతివ వాక్యగోచరముగఁ జే
     య నశక్యము సుభగ శ్రీ, నెనసినయది దీని నీవ యెఱుఁగుదు వెదకన్.116
క. నినుఁ దేపగాఁగఁ గైకొని, మనోరథపయోధి యేను మానిని గడవన్
     గని చరితార్ధత నొందుదు, నని తలఁచెద నీ సహాయ మల్పమె యెందున్.117
ఉ. నావునుఁ జిత్రరేఖ లలనా యది యట్టిద నాదుదేహమున్
     జీవితము న్భవత్ప్రియము చేఁతకు నైనవి గాక యొంటికే
     యేవెర వైననూఁది భవదిష్టునిఁ దెచ్చెదఁ దొల్తఁ దెల్లగా
     నావినుతానుభావుఁ దెలియన్వలయుం దదుపాయ మెద్దియో.118
తే. ఇట్టివాఁ డని నీవును నెఱుఁగఁ జెప్ప, నేర వెమ్మెయి నెఱుఁగంగ నేరవచ్చు
     వినక చూడక యెఱిఁగెడువిధము గలదె, కడిఁది యెవ్విధమున నిది కమలనయన.119
క. చాయయుఁ జందము నించుక, యీయనువని నీవు చెప్ప నెఱిఁగెదవేనిన్
     వేయేల పుట్టుఁ బేరును, శ్రీయుఁ బ్రభావంబుఁ దెలియఁ జేపడును దుదిన్.120
సీ. వసువులు రుద్రులు వాయువు లశ్విను లాదిగా నెవ్వారి కైనఁ జొరఁగ
     రానిశోణితనగరంబు నిర్భయత దైత్యాధీశుతల వ్రేసినట్లు సొచ్చి
     సరసభావమున నీసర్వభావంబులు భోగించి పోయినపురుషవృషభుఁ
     డిప్పు డెన్నినవీరి కెల్లను వేవేలు క్రమముల నెక్కుడుఁ గాక యున్నె
తే. బాణునకు వేయిభుజములభరము డించు, కయ్య మిచ్చువాఁడును వీఁడె కాఁగఁబోలు
     నిట్టిపతిఁ బొందలేనియయ్యింతిరూపుఁ, [1]బ్రాయమును సిరియును నపార్థములు గావె.121
చ. అనుసఖిభాషణంబులకు నంగజరాగరసంబు దోడుతోఁ
     వనువున నాత్మఁ బిక్కటిల దందడి వేగిరపాటు నార్తియున్
     ఘనముగఁ జేయ నచ్చ తెలిగన్నులఱెప్పల నశ్రుబిందువుల్
     వనరుహకేసరస్థహిమవారిలవంబులపెంపు డింపఁగాన్.122
వ. నెచ్చెలికేలు గేలం గైకొని మౌళిం జేర్చి.123
మ. తమకార్యంబుల కెల్లవారుఁ గడునుత్సాహంబు వాటింతు రు
     ద్యమ మన్యార్థము సేఁత దుర్లభము మత్ప్రాణంబుతోఁ దుల్యగా

  1. బ్రణయమును జేయునంసమర్థముల కావె.