పుట:హరివంశము.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

356

హరివంశము

సీ. తన వినిర్మలబుద్ధిఁ దనరునుద్యోగంబుతోన ప్రాభౌతికద్యుతులు వెలయఁ
     దనయుత్సహించినపనికి దవ్వగువిఘ్నతమముతోడన తిమిరములు తొలఁగఁ
     దనమనోరథములఁ దలకొను రాగసంతతితోడఁ బూర్వసంతతియు వెలయఁ
     దనమనంబునఁ బేర్చుఘనవికాసంబుతోడన పంకజోల్లాసమును దలిర్ప
తే. నమరుశర్వరివిరతియం దద్యుతుండు, తన[1]యుదర్కోదయంబుచందమున మెఱయ
     నుజ్జ్వలార్కోదయంబున నుచితనియమ, జాలమంతయుఁ బాటించి [2]లీల నరిగి.121
క. గోవులు బసిండిప్రోవులు, దేవతలంబోలు ధరణిదేవతలకు సం
     భావనతో నిచ్చి భువన, భావనుఁ డనుజీవకోటి పరివృతి నొప్పన్.122
వ. ఆస్థానమండపంబునకుఁ జనుదెంచి సింహాసనోపరితలంబున సింహంబు శిఖరిశిఖరో
     పరిభాగం బలంకరించుకరణి నలంకరించి.123
సీ. బలభద్రదేవునిఁ బిలువుఁడు సాత్యకిఁ దోట్తెండు గృతవర్మఁ దోడుకొనుచు
     రండు సారణు వేగ రాఁ బంపుఁ డిపు డుగ్రసేనుని విజయము చేయు మనుఁడు
[3]బ్రతుకెల్ల దనబుద్ధి ప్రాప కా నమరులు దననీతి కలరఁగఁ దనమహత్త్వ
     మెసఁగ యదుశ్రేణి కెక్కటికొనియాట కెల్లయై తనరార నెందుఁ బరఁగు
తే. నుద్ధవాచార్యు [4]నార్యు ననుధ్ధతోక్తి, ధుర్యు రాబంపుఁ డని వేఁడఁ గార్యకరులఁ
     బనుప వాఁడును నట్ల చేసిన నశేష, వృష్ణివీరావళియు వచ్చె విష్ణునాజ్ఞ.124
వ. ఇట్లు వచ్చి మహనీయసభాభవనంబున నందఱు నుచితప్రదేశంబుల నుండి తన
     ముఖకమలంబుమీఁదం జూడ్కిగములు ప్రోడతుమ్మెదపదువులఁగాఁ జేయుచు
     నుల్లసిల్ల నుత్ఫుల్లవదనుం డగుచు నంబుధిసదనుండు వారల కి ట్లనియె.125

శ్రీకృష్ణుఁడు బలభద్రాదులకుఁ దనకైలాసయాత్ర దెలియఁ జేయుట

చ. వినుఁడు యదుప్రవీరు లతివిశ్రుత మైనమదీయవిక్రమం
     బనయము బాలభావమున యంతటినుండియుఁ గల్గి యెట్టిబ
     ల్పను లొనరించెనో యది దలంపఁగఁ దెల్లముకాదె మీకుఁ బూ
     తన పడు టాదిగా నరకదైత్యునికూలుట యంతిమంబుగాన్.126
శా. ఇంకొక్కండు గలండు నాకుఁ బగతుం డీమూఁడులోకంబులం
     గింకం దా నొకరుండు గెల్పుకడిమిం గీ ర్తింపఁబడ్డాఁడు సా
     హంకారుండు నిరంకుశప్రసభరోషారంభుఁ డత్యంతని
     శ్శంకస్వాంతుఁ డనంతవిశ్రమకళాశౌండుండు పౌండ్రుం డనన్.127
క. వానికిఁ దలంకుదు నెప్పుడు, నే నవ్వీరుఁడును నన్ను నెడఁ గైకొనఁ డ
     మ్మానఘనుఁ గూల్చునంతకు, నానెమ్మన మెద్దియుం గొనదు విజయముగాన్.128

  1. యుదర్కోదయంబు
  2. చాల నలరె
  3. మాకునుఁ దనబుద్ధి ప్రాప కా నమరులు
  4. నాసన: నాచార్యు.