పుట:హరివంశము.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 5.

353

శ్రీకృష్ణుఁడు బ్రాహ్మణునకు మృతపుత్రదానంబు చేసి పంపుట

చ. మును చనియున్న బాలకులు మువ్వురుఁ దత్క్షణజాతుఁ డొక్కఁ డి
     ట్లొనరు మహీసురేంద్ర సుతు లొక్కొటి నల్వురఁ దెచ్చి యిచ్చెఁ ద
     జ్జనకున కమ్మహాత్ముఁ డతిసమ్మదవిస్మయవారిరాశిలో
     మునింగితి నమ్మహాద్విజుఁడు మున్నుఁగ నేను నృపాలపుంగవా.95
క. మముం దోడ్కొని యరదము, గ్రమన మును సన్న తెరువు గైకొని మగుడన్
     నెమ్మన మలరఁగఁ నాత్మపురమున కేతేంచె విభుఁడు రమ్యస్ఫూర్తిన్ 96
వ. ఇవ్విధంబున నమ్మహాకార్యం బర్ధదివసంబులోనన సమాప్తం బగునట్లుగాఁ జను
     దెంచి యవ్విప్రవరునకు సత్కారపూర్వం బగుభోజనంబు సంఘటించి యభిమత
     ధనధాన్యంబులఁ దృప్తిఁ గావించి యతని వీడ్కొలిపి యనుతరంబ మున్ను సమా
     రబ్ధం బైనయధ్వరంబును సమాప్తి నొందించి యొక్కనాఁడు.97
సీ. స్నాతుఁడై త్రైలోక్యచక్షు నంబుజమిత్రు నర్ఘ్యార్పణాదిసమర్చనమున
     భావించి మధ్యభూదేవసహస్రంబునకు నభీష్టాన్నదానం బొనర్చి
     యేను సాత్యకి యాదిగా నర్హు లగువారిఁ దనబంతి నిడికొని దనుజమథనుఁ
     డంచితాహారకృత్యమునఁ బ్రమోదించి విలసితాలం కారములు దలిర్పఁ
తే. గొలువుకూటంబునకు వచ్చి యెలమి నగ్ర, పీఠమున నుండి యేము సంప్రీతితోడ
     బలసియుండ విచిత్రసంభాషణముల, నలరుచుండఁగఁ దగఁ బ్రసంగాంతరమున.98
వ. ఏ నవ్విప్రబాలకులపోక కేమి కారణం బెవ్వఁడు గొనిపోయి రెక్కడ నుండి రని
     యడిగితి నడిగిన నద్దేవుండు నా కి ట్లనియె.99
మ. వినుమా విశ్వచరాచరంబులకు నావివిర్భావదుర్భావముల్
     పొనరింపం బ్రభుఁడైనయాద్యుఁడు మహాభూతంబు భూతేశ్వరుం
     డనిరూప్యాకృతి యప్రమేయవిభవుం డద్వంద్వుఁ డస్పందుఁ డెం
     దును దానై తనరారుతత్త్వము జగద్గుర్యుం డహార్యోన్నతిన్.100
క. ప్రకృతి యనఁ బురుషుఁ డనఁగా, సకలమునకు నాశ్రయంబు సాంఖ్యులకును యో
     గికులంబునకును గమ్యం, బొకఁడై చనుచోటు శశ్వదుదితుఁడు బుద్ధిన్.101
క. ఘోరతమఃపారమున ను, దారంబై తోఁచుపరమధామము సంసా
     రోరురుజకు దివ్యౌషధ, మారబ్ధసవిద్ధకర్మ మగుధర్మ మిలన్.102
వ. అట్టిపరమేశ్వరుండు మదీయదర్శనం బపేక్షించి కృష్ణుఁడు బ్రాహ్మణప్రయోజనం
     బనుష్ఠేయం బగునేని సర్వంబు నుజ్జగించి యెల్లభంగులం జనుదెంచు నిదియ
     యుపాయం బని విప్రబాలకుల నుద్భవకాలంబులయంద కొనిపోవుచు వచ్చె
     నేను నడుమ నడ్డపడిన సముద్రంబు సంస్తంభించి పర్వతంబులయం దంతరంబులు