పుట:హరివంశము.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

హరివంశము

     మేదోమస్తిష్కపటలంబులు దొరుఁగ నురికి నెత్తురు వెల్లువ లై పెల్లొదవినఁ ద్రిదశ
     సంయమిలోకంబుల కుత్సేకంబు లొదవె నివ్విధంబునఁ దన బలంబులు బలాధిప
     పూర్వకంబుగా వికలంబు లగుటయు.146
మ. భ్రుకుటీజంధనబంధురోగ్రవదనంబున్ దష్టదంష్ట్రాంధర
     ప్రకటాహంకరణోచ్చహుంకృతియుఁ [1]బ్రస్పందాతివృత్తాంసలో
     త్సుకబాహాయుగళంబునై వసుమతీసూనుం డనూనైకసా
     ధనసన్నాహముతోడ వెల్వడియె నుత్సాహానపోహాకృతిన్.147
క. వెలువడి సమస్తశాత్రవ, [2]విలూననక్షమత నేకవీరుఁడు తానై
     వెలుఁగొందుకృష్ణుఁ గనుఁగొని, యలఘుకఠోరాట్టహాసుఁ డై యి ట్లనియెన్.148
మ. అనిలో నింద్రునిగోము మాన్పి పెఱదేవానీకము న్జీరికిం
     గొన కీమూఁడుజగంబులం [3]గలఁచి యక్షోభ్యుండ నై యెందుఁ బే
     ర్చినవాఁడ న్నరకుండు నాఁ జనుసురారిశ్రేష్ఠుఁడన్ నన్నుఁ బే
     ర్కొనుచోటం [4]గొఱగావ యన్యసుభటప్రోత్సాహమాహాత్మ్యముల్.149
క. నీ వేల వచ్చి తిచటికి, నేవాఁడవు [5]మోపుటఱక నేపారెడునీ
     లావరిపులుఁ గెక్కడియది, యీవారిజనయన యెవ్వ రేర్పడఁ జెపుమా.150
తే. నిన్ను నీప్రొద్ద చల మొప్ప నిహతుఁ జేసి, యేను గైకొనఁగలవాఁడ నీలతాంగిఁ
     దలఁక కొక్కింత బంటవై నిలువు మోపి, తేని [6]నన నవ్వుచును బరమేశ్వరుండు.151
వ. అద్దురాత్మున కి ట్లను నేను నీ త్రిలోకప్రసిద్ధుం డగు వాసుదేవుండ నీకు శ్రుత
     పూర్వుండ నగుదునో కానో యెఱుంగ నీభామ సత్యభామ యనునది మదీయ
     ప్రేయసి యివ్విహంగమంబు విహంగమకులచక్రవర్తి యగు వైనతేయుండు
     మద్వాహనం బిచ్చోటికి నఖిలలోకహితార్థంబు సమస్తకార్యధుర్యుండ నై
     నిన్నుం బొరిగొనఁ జను దెంచితి నింక నెయ్యది సెప్పెదు చెప్పు మనిన మఱియుం
     బెలుచ నవ్వి యవ్విబుధశత్రుండు.152
శా. ఏ మేమీ వసుదేవనందనుఁడవే యీ వెట్టిభాగ్యంబొ సం
     గ్రామం బెన్నఁ డొనర్తునో కడిమి మైఁ గంసారితో నంచుఁ జే
     తోమోదంబునఁ గోరుచుండుదుఁ గడున్ దోరంబుగా నుండె మ
     త్కామం బోపినయంతయుం బెనఁగు నీదర్పంబు పెం పేర్పడన్.153
వ. నాచేతం జిక్కి [7]వెడలంబడ నేర్చెదే యని యదల్చి యసురవీరుండు వృష్ణివీరుం
     దాఁకి పెల్లేసిన నతండును మందహాసవికాసభాసమానుం డగు నాదానవు నెదు
     ర్కొనియె నయ్యిద్దఱకు నుద్ధామం బగు సంగ్రామంబు భీమం బై సుత్రామవృత్రు
     లకు రామదశగ్రీవులకుంబోలెఁ బ్రవర్తిల్లె విస్తరింప నలవిగాదు సంక్షేపరూపం
     బున వినుపించెద నాకర్ణింపుము.154

  1. బ్రస్పందాలివృత్రాంసనో
  2. విలోలనక్షమత
  3. గెలిచి
  4. భయమందు నన్య
  5. మ్రోపుటఱక, మోసపుటెఱుక లే.
  6. ననుటయు నగి పర
  7. వెలువడ