పుట:హరివంశము.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము. ఆ. 2.

263

సీ. భోజవంశమువారు [1]రాజు లై యుండంగ యాదవుల్ కింకరు లై చరింతు
     రట్టియన్వయమునఁ బుట్టియుఁ గడుబాము మాలితి నీకంటెఁ బాలిశుండు
     గలఁడె యెవ్వఁడు పుత్రుఁ బొలియించె నాకృష్ణుఁ డెక్కటి తద్రాజ్య మెల్లఁ దాన
     కొని రిత్తపట్టంబు నినుఁ బూన్ప నతనిపెట్టెడు నన్నపిండంబు గుడిచె దకట
తే. యెట్లుగాఁ బెద్దవాఁడ వై తేమి బ్రతుకు, సిగ్గఱినభోగ మెట్లు రుచించె నీకు
     హరికి బంటవు గాక నీ వవనిపతివె, యిట్టి రాజధర్మధ్వంసి నేను సైప.27
క. నినుఁ దొలుత ససైన్యముగా, ననిలోఁ దెగటార్చి పిదప యాదవుల జనా
     ర్దనపూర్వజవూర్వకముగఁ, దునుముదు నీపీఁచమడఁగ దుర్దమశక్తిన్.28
వ. అనిన నమ్మాటలకుఁ గలుషించి కమలనాభుండు.29
ఉ. అక్కట యుగ్రసేనుని మహాత్మునిఁ బల్కుట సంగరంబునం
     దెక్కుడు పౌరుషంబు వెలయించుటయే పలుకం దలంచినన్
     స్రుక్కక నన్నుఁ బల్కుము విరోధి నొకండన కాన నాకు నీ
     యుక్కివ మెన్నిచందముల నోర్వక పోవునె వేయు నేటికిన్.30
తే. నాఁడు గోమంతనగమున నన్ను నాజిఁ, గదిపి చూచినవాఁడవు గావె నీవు
     నాఁటివాఁడవ నేనును నవ్వుఁబాటు, గాదె యిట్లంట యీ వితర్కంబు వలదు.31
ఉ. ఇమ్మెయి నిప్పు డగ్గమయి యెప్పటియట్టుల డాఁగురించి నీ
     విమ్ములఁ బాఱిపోవ కొకయించుక నిల్చితి వేని నీదుకం
     ఠమ్మవికుంఠితాస్త్రవికటప్రహతిం దునుమాడువాఁడ ని
     క్క మ్మిది సూడు మస్మదవిఖండితగర్వము సర్వము న్నృపా.32
క. అని యిరువదేనుతూపుల, జనపతి [2]నైదింట నతనిసారథిఁ బ్రభుఁ డే
     పున నొంచి కార్ముకముఁ గే, తనముఁ దునిమె రెండు సునిశితప్రదరములన్.33
వ. అట్టియెడఁ గౌశికచిత్రసేను లతిరయంబున నడ్డంబు సొచ్చి వాసుదేవుం బెల్లేసిరి
     కౌశికుండు వేఱ మూఁ డమ్ములు హలాయుధు మేన గ్రుచ్చె నాతం డతని విల్లు
     భల్లంబున నఱకి యుఱక మెఱుంగుటమ్ము లెమ్ములం గీలించినం దలంకక కోదం
     డాంతరంబు ధరియించి మాగధసేనాపతి యమ్మాధవాగ్రజుతో నేట్లాడుచుండం
     జిత్రసేనుండు దోడ్పడియె నంత.34
ఉ. ఒండొక విల్లుపుచ్చుకొని యుగ్రగతి న్మగధేశ్వరుండు దో
     శ్చండిమ సూపెఁ గృష్ణునకు సైన్యపు లిద్దఱు భర్తఁ గూడి యొం
     డొండ హరిన్ హలాయుధుని నొక్కట నేసిరి వారి మువ్వురన్
     దండిమగండు పంకరుహనాభుఁడు నొంచె శరత్రయంబునన్.35
తే. ఉగ్రసేనుని మెయినాటె నుగ్రబాణ, మాజరాసంధుఁ డొకటి యయ్యవనిపతియు
     డెబ్బదేను దొమ్మిదియును నిబ్బరంపు, టమ్ము లతనిపైఁ బరఁగించె నలుక మిగుల.36

  1. పూజ్యులై
  2. నేడింట