పుట:హంసవింశతి.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88 హంస వింశతి



ఉ. నావిని హంస పల్కు, వదనంబున హాసము దోఁపఁ బల్కె హే
మావతి "యద్దిరా! మగలమార్చు నెలంతదిగాక యింకఁ గ
దా? వివరించి చూడ వసుధాస్థలిలో" నను నంతలోపలన్
వేవినఁ గేళికాగృహము వేగ చనెన్ నృపమోహమగ్నమై. 128

వ. మఱియు నయ్యహర్ముఖం బప్రకాశమానకావ్యలక్షణంబయ్యును బ్రకాశమానకావ్యలక్షణంబై యనిద్రాళువనాంతరాళపుండరీకసముదయంబయ్యును నిద్రాళువనాంతరాళపుండరీకసముదయంబై యప్రస్ఫుటీకృతకువలయంబయ్యును బ్రస్ఫుటీకృతకువలయంబై యవిభాసమానద్విజరాజంబయ్యును భాసమానద్విజరాజంబై యవిభాసితతారాళిగణంబయ్యును విభాసితతారాళిగణంబై యొప్పె నప్పుడు. 129

క. ఒక నిముసం బొక మాసం
బొక ఘటికయ యొక్క యయన మొక జా మొక యేఁ
డొక దిన మొక కల్పముగా
సకి గడపెన్ బగలు విరహసంతాపమునన్. 130

క. రవియనెడు కాలచక్రము
దివసాంతప్రళయవేళ దీపాగ్నులచే
దివిఁ గాల్చి యడఁగ నమ్మషి
నివహంబన ఘోరతమము నిండెన్ బెలుచన్. 131

వ. అప్పుడు. 132

చ. చందురకావిపావడ పసల్ వెలిఁజిమ్మఁగఁ జల్వగట్టి, కా
లందెలు సందిదండలును హారములున్ మణికుండలమ్ములున్
బొందుగఁ దాల్చి వాసిలెడు పూలసరుల్ కచసీమఁ జుట్టి పొ
ల్పొందఁ గళాస గందవొడిఁ బూసి మృగేక్షణ వచ్చి నిల్చినన్. 133