పుట:హంసవింశతి.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74 హంస వింశతి

ఉ. ఆ సమయమ్మునన్ జెమట లాస్యముఁ గప్పఁగ నిండు బళ్ళికల్
గాసిలఁ జేయఁగాఁ గబళకాంక్షకు జీవము వేగురింప, ని
శ్శ్వాసము బారుఁదీర నిజవల్లభుఁడౌ శుభభద్రుఁ డట్లు సం
వాసముఁ జేరవచ్చి తలవాకిలిఁ దీ యని పిల్చె వల్లభన్. 55

తే. అప్పు డేరీతి నుపనాథు నవల కనుప
సుందరీ! యే యుపాయంబుఁ జూడవలయు?
జాణవౌదువు జారవాంఛలకు నైతె
తెలుపు మని పల్కెఁ గలహంస దేవవిభుఁడు. 56

క. అని యడిగిన హేమావతి
విని దీర్ఘోచ్ఛ్వాస మొనర విడిచి నిజాంఘ్రిన్
గనుదృష్టి నిలిపి మెల్లన
మునివ్రేలన్ నేలగీచి మునుకొని పలికెన్. 57

క. తెలియ దెటు పనుపవలెనో
పలుమఱు నే బ్రహ్మలోకపర్యంతంబున్
గలయ వివరించి చూచితి
నలవడ దది నీవె తెలుపు హంసబిడౌజా! 58

క. అని యడిగిన హేమావతి
కనురాగం బొప్ప రాజహంసం బనియెన్
వినుము నిజాధిపుఁ డటువలెఁ
దనుఁ బిలిచిన యువతి లేచి తరలక ప్రీతిన్. 59

క. పిలిచిన గుండె లొటుక్కనఁ
గలఁగుచు వ్యాపారి వెడలఁగా నెటు లనుచున్
దలఁచినచో వెఱవకు మని
నిలిచిన దార్ఢ్యమున మానినీమణి వేడ్కన్. 60