పుట:హంసవింశతి.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోయి రమ్మని మోము మోమున ఘటించి
చుంబన మొనర్చి పనిచె నయ్యంబుజాక్షి. 108

వ. అంత. 109

తే. మణిఖచితహేమపంజరమధ్యమునఁ
బ్రేమ నాబాల్యముగఁ దాను బెంచినట్టి
హంసరాజంబుఁ గదియంగ నరిగి, తనదు
పయన మెఱిఁగించి యింటిలో భద్ర మనుచు. 110

క. చెప్పంగఁ దగిన మాటలు
సెప్పి మరాళంబు వనుపఁ జిత్తంబున సొం
పుప్పతిల నిల్లు వెలువడి
యప్పగిదిన్ విష్ణుదాసుఁ డరిగెడువేళన్. 111

తే. ఈడము వళంద బందర యింగిలీషు
కళము మొదలైన పేఁటల గౌరలెల్ల
సౌరభద్రవ్యములు బేరసార మాడఁ
బిలువనంపిరి తమతమపేఁటలకును. 112

చ. అటువలె విష్ణుదాసుఁడు హితావళి గొల్వఁగఁ దోడిబేర మం
దుటకుఁ జనంగ హేమవతి తోడనె శంబరవైరి శాతవి
స్ఫుటచటులోగ్రపంకరుహసూననవీనశరవ్రజంబు హృ
త్పుటమున గాఁడనేయ నృపపుంగవుఁ జేరఁగఁగోరి యున్నెడన్.

చ. విలసితమోహదాహపరివేదన పొమ్మని యెత్తు పెట్టఁగా
వలపులవింటివాఁడు నెఱవాదితనంబునఁ ద్రోవఁజూపఁగా
నలమిన భీతి లజ్జ వలదం చరికట్టఁగ నింతి నంతలో
జలజహితుండు గ్రుంకె నల చానవెతల్ కనలేని కైవడిన్. 114