పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iii



మా మాట

మంచి రచనలు అందించాలనీ,
మంచి అభిరుచి పెంపొందించాలనీ,

పాఠకులు కలకాలం తమ సొంత గ్రంథాలయంలో మంచి పుస్తకాలు పెట్టుకుని పదే పదే వాటిని చదువుకోవడానికి దోహదం చెయ్యాలనీ - మా చిరకాల వాంచితం.

ఈ ప్రయత్నంలో మా సోదర సంస్థ 'న్యూ స్టూడెంట్స్ బుక్ సెంటర్' యిప్పటివరకు చాలా విజ్ఞాన దాయకమైన పుస్తకాలను, ఉత్తమ సాహిత్య గ్రంథాలను ప్రచురించి, చేతనైనంత కృషి చేస్తూందని మీకు తెలుసు.

ఇప్పుడు మా నూతన సంస్థ 'అభినందన పబ్లిషర్స్' ఒక సాహసం చేస్తోంది. అయితే, ఈ సాహసం ఆనందకరమైనది. ఒకరకంగా గర్వకారణమైనది. అదే, 'కవిశేఖర' పానుగంటి లక్ష్మి నరసింహారావు గారు రచించిన 'సాక్షి' వ్యాసాలను ప్రచురించి - అభిమాన పాఠకులకు అందించడం.

కొందరు - కథలు వ్రాసి, గొప్ప కథకు లనిపించుకున్న వారున్నారు. కొందరు నవలలు వ్రాసి గుర్తింపు, గౌరవం పొందిన వారున్నారు. అలాగే కవులనిపించుకుని రాణకెక్కిన వారున్నారు. కాని - 'వ్యాసం' అనే ప్రక్రియకు అపూర్వమైన సాహిత్యగౌరవం తెచ్చిపెట్టి - పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న మహా రచయిత బహుశా పానుగంటి వారొక్కరే. నాటకం వ్రాసి గురజాడవారు గిరీశం పాత్రను చిరంజీవినిచేస్తే, పానుగంటివారు వ్యాసాలను ఉపన్యాసాలుగా, ఉపన్యాసాలను వ్యాసాలుగా జలకాలాడించి - జంఘాలశాస్త్రి ప్రాతను చిరంజీవిని చేశారు. ఈ వ్యాసాలలో పానుగంటి వారి శైలి, విషయ విన్యాసం చూస్తుంటే, చురకత్తి కొసను మల్లెదండ వ్రేలాడ దీసి నట్టుంటుంది. 1913లో కొంతకాలం, 1920లో కొంతకాలం 'సాక్షి' వ్యాసాలను ఆయన రచించారు. ఎందరో అసంఖ్యాక పాఠకుల్ని ఆకర్షించారు. ఆలరించారు. పానుగంటే సాక్షి, సాక్షే పానుగంటి అనిపించారు.

తొలుత ఈ వ్యాసాలను పిఠాపురం రాజావారు ముద్రించి ప్రచారం చేశారు. ఆ తరువాత మద్రాసులోని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్‌వారు ఆరు సంపుటాలుగా ప్రచురించారు. ఈ విషయాలు జరిగి దాదాపు నలభై సంవత్సరాలు గడిచాయి. (వావిళ్లవారికి సంబంధించినంతవరకు)

ప్రస్తుతం ఆ ఆరు సంపుటాలు 'సాక్షి' వ్యాసాలను - అక్షరంపొల్లుపోకుండా మొత్తం మూడు సంపుటాలుగా పాఠకులకు అందించగలిగే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తున్నాం.

1920 లెక్కవేసుకున్నా, ఈ వ్యాసాల రచన జరిగి ఇప్పటికి 70 ఏళ్లు కావస్తోంది. వీటి భాష గ్రాంథికం. విషయాలు ఎంత ఆసక్తి కరమైనవైనా, ఎంత హాస్యరసప్రధానంగా వున్నా, ఈ నాటి పాఠకులకు ఈ 'సాక్షి' ని చేరువ చెయ్యాలంటే, వ్యావహారిక భాషలో, ప్రతి వ్యాసం సారాంశం ముందు 'టూకీ' గా అందిస్తే బాగుంటుందని తోచింది. ఈ మా