పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

177


క.

ధర్మాధర్మము లొల్లక
కళాసక్తుండు గాక కా దౌ ననకన్
నిర్మలభావుం డగుచును
మర్మజ్ఞత నతఁడు మెలఁగు మనుజులలోనన్.

150


క.

ప్రాజ్ఞుండై దేహముతో
నజ్ఞానులయందు మెలఁగు నందున నాయో
గజ్ఞుని మదిఁ దెలియకఁ గని
యజ్ఞానులు నిందఁ జేతు రాగతి నోలిన్.

151


తే.

దూషణము సేయువారికిఁ దొల్లి యతఁడు
చేసియుండిన పాపము చెందుచుండు
భూషణము సేయువారికి బుణ్యఫలము
నపుడు పొందఁగ నిర్లేపుఁ డగుచు నతఁడు.

152


సీ.

పెద్దవన్న నహంబుఁ బెంచి వల్కఁడు చిన్న
        వనినఁ దగ్గఁడు భాగ్య మతిశయముగఁ
గల్గిన నుప్పొంగి గర్వింపఁ డొకవేళ
        దనకు లేవడియైనఁ దగ్గిపోఁడు
ప్రారబ్ధ మనుభవింపక తీరదని యస
        హ్యముగ దుఃఖసుఖంబు లనుభవించు
నమ్రపత్రంబున నంటనిజలబిందు
        వట్ల సంసారము నంటకుండు


తే.

జగతిగల బంధమూలంబు దెగినదాని
వచ్చి కొన్నాళ్లు నిలిచినపగిది దేహ
మూలమగుగారణావిద్య మొదలుతెగిన
నాయు వనుపచ్చియున్ననా ళ్లంగముండు.

153