పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

33

సీ. కడకేగవచ్చునె కావేరి కావేరి లహరికాల్లోకనోల్లాసములను
      తొలఁగిపోవుదమన్న తలఁపుపుట్టించునె యీసైకతద్వీపవాసమహిమ
      యెడబాయవచ్చునె యీదృకోభయకూల రమణీయశోభనారామవసతి
      యెంత లేదనవచ్చునే సప్తకాల విశాలపట్టణ మహైశ్వర్యగరిమ
      కాన నిత్యనివాసయోగ్యంబు మాకు, నిచ్చట నివసింప వరము లేనిచ్చినాఁడ
      కోరి కావేరి మున్నగువారి కెల్ల, మాకు హితమైన నీకు సమ్మతము గాదె.
శా. రక్షోరాజ్యము లంక మాకు నిలువన్ రాదచ్చట న్నీపయిం
      బక్షం బెప్పుడునుండి నిన్నెకనుచున్ బాటించి నీరాకలన్
      బ్రేక్షామాలికలుంచి నీయభిమత శ్రీలిత్తు రామాయణం
      బీక్షోణిం గలయంతకాలమును నిన్నేలింతు సామ్రాజ్యమున్.
గీ. విననియు రాముఁ డని భేద మింత లేదు, కొలిచితివి మమ్ము నీకింత కలుగనేల
      లంకకును బొమ్ము వలయువేళైన వచ్చి, రాకపోకలు నడుపు శ్రీరంగమునకు.
క. మానసపూజావేళల, యే నచటికి వచ్చి నీదు హృదయమునందున్
      ధ్యానించినట్ల నిలుతు న, నూనదయామహిమ ననుచు నుపదేశింపన్.
మ. అనుమానంబులు మాని భేదములు మాయంజేసి యానందవా
      రినిధిన్ దేలుచు నేకృతార్థుఁడను చేరెన్ నాదభీష్టంబులున్
      నినుఁ గానేదిప్రతిష్ట చేసె ననుటింతే చాలదే నాకు వే
      రనఁగా నెవ్వరు నీకృపామహిమచే నేగంటి నిష్టార్థముల్.
గీ. అనుచు వలగొని మ్రొక్కిపోయెను విభీష, ణుండు లంకకు తనవారలండఁ గొలువ
      నాటనుండియు నేను కావేరినడుము, లోకరక్షణతా జాగరూకమహిమ.
క. ఉన్నాఁడగాన నీకు ప్ర, సన్నుఁనైతిని మదీయచరితము నాచే
      విన్నట్టికతన నెవ్వరు, నిన్నుఁ దలంచినను వారి నేరక్షింతున్.
సీ. వినుము సుబోధ నా వినుపించు మత్కథ వినిన వ్రాసిన జదివిన జనంబు
      సకలకల్యాణముల్ సంగ్రామవిజయంబు పుత్రలాభము సర్వభోగములును
      కామినీమణులు సంకల్పఫలంబులు ధనధాన్యవస్తువాహనసమృద్ధి
      ఆరోగ్యభాగ్యంబు హతకల్మషంబును దీర్ఘాయువును పితృదేవహితము
      దివ్యభూషణవస్త్రముల్ భవ్యకీర్తు, లతులసంతోషములు సుఖస్థితుల నొంది
      వెనుక కైవల్యసౌభాగ్యమున వసింతు, రింతయును సత్యమని యానతిచ్చె గాన.
క. గారుడసంహితలోపల, శ్రీరంగమహాత్మ్య మిది ధరిత్రిజను లె
      వ్వారు పఠించిన వినినన్, వారి యభీష్టార్థములు ధృవంబుగ గలుగున్.