పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

13

      కలరె మఱియన్యదైవములు ప్రపంచ, సృష్టియెట్లయ్యె నెట్టివాంఛితమనుండు
      భూమ్యచలసాగరద్వీపములు తెఱంగు, లానతిండన మఱియు నిట్లనియె నతఁడు.
చ. అడిగెడి దీశ్వరావయవమైన ప్రపంచములో తెఱంగు దా
      నొడువుదునంచు నెంతటిఘనుల్ వచియింపసమర్థులే తలం
      పడుగుటఁ జేసి శౌరికృప నాత్మకు లోనగునంతమాత్ర మే
      ర్పడు వివరింతునంచు నిరపాయవివేకనిధాన మిట్లనున్.
గీ. పృథివి తొమ్మిదియగు నర్షభేదములను, ద్వీపభేదంబులను సప్తవిధము లయ్యె
      భూమిపరిణామవిధముఁ దన్నామములును, లోకములచంద మెఱిఁగింతు నీకు నిపుడు.
సీ. వర్షభారతము కింపురుషంబు హరీవర్షంబనంగ నిలావృతంబనంగ
      కెలనభద్రాశ్వంబు కేతుమాలాహిరణ్మయము నాగ వర్షనామములు దాన
      నొకపేరు వర్షంబునకు వేరువేర తొమ్మిదిఖండములు సౌంజ్ఞ లొదవు మొదటి
      భారతవర్షంబు నీరీతి నవఖండములనొప్పు నిందు దీవులు వచింతు
      జంబువును ప్లక్షనామంబు శాల్మలియు గు, శంబు క్రౌంచంబు శాక పుష్కరము లనఁగ
      లక్షయోజనముల నొప్పు ప్లక్ష మిటుల, యొక్కటొక్కటి ద్విగుణించి యొప్పుచుండు.
గీ. ఇట్లు ధారుణి యేఁబదికోట్లయోజ, నాలివర్తించు డెబ్బదివేలఁ గోట్లు
      పొడవుమీఁదటిలోకముల్ బుడమిగ్రిందు, నుండు యొండొండఁ బదివేలయోజనములు.
క. ఇంతయు బ్రహ్మాండంబగు, నంతయు దా బ్రహ్మశక్తి నౌదలనిడి ని
      శ్చితుండై శేషభోగి య, నంతుఁడు వర్తిల్ల జగము లారాధింపన్.
గీ. సూర్యచంద్రులదీప్తి యచ్చోటనుండు, నంతమాత్రంబె భూమియు నాకసంబు
      దిక్కులునుగాని యామీఁదనోక్కటియును, గానమిక వొందు బ్రహ్మాండకర్పరంబు.
సీ. జగతికి లక్షయోజనములపై సూర్యుఁడుండు నిన్మడిఁ జంద్రమండలంబు
      తద్విగుణంబు బుధగ్రహమండలం బలవడ శుక్రమండలము నట్ల
      యామీఁద భౌమ బృహస్పతి శనిమండలంబులు తద్విగుణంబు వాని
      పై లక్షయోజనపరిమాణనసతి సప్తర్షిమండల మొప్పు దానిమీఁద
      గాలచక్రప్రమాణశిఖాముఖమున, నమరు ధృవుడటు మూడులోకములు నయ్యె
      దానిపైఁ గోటియోజనస్థలమునందు, నమరుచుండు మహాలోక మనఘచరిత.
క. యోజనకోటిద్వయమిత, మై జనలోకంబుమీఁద నగుతద్విగుణం
      బాజగతి తపోలోకం, బాజమిలిన్ సత్యలోక మభినుతిఁ గాంచున్.
క. సత్యాదిలోకషట్కము, ప్రత్యేకము వాయు పాశబద్ధములై సా
      తత్యము ధృవమరుదు ధృవా, దిత్యులకు న్నడుమనిడి ప్రదీపితుఁ డయ్యెన్.