పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

143

గీ. దేవ పుత్రార్థినై నీదు తిరువడిఘంబు, శరణు జొచ్చితి జన్మంబు సఫలమయ్యె
      కోర్కు లీడేర్పు మన నెంత కొంగుముడిగ, గల్గునన్నట్లు దక్షిణగౌళి బలికె.
క. విని సన్నిధివారలు న, జ్జనపతియును నలరి తత్ప్రసాదము గొని సే
      నలు దాను పురికి నరిగెన్, గలిగిరి తనయులు నృపాలకశ్రేష్ఠునకున్.
గీ. జ్యేష్ఠతనయుని రాజ్యాభిషిక్తుఁ జేసి, పెక్కుబుద్ధులు బల్కి తానొక్కరుండు
      బంధములు వాసి రంగేశు పట్టణంబుఁ, జేరి కొన్నాళ్ళు మోక్షలక్ష్మిని వరించె.
సీ. విను నాగదంత పావనమైనయట్టి యీయితిహాస మేనరు లేని వినిన
      జదివిన వ్రాసిన సకలభోగంబులు గుణవిమోచనము కారణము సుకృత
      తరుణీసుతావాసధనధాన్యపశువస్తువాహనలబ్ధియు వైరిజయము
      దుస్స్వప్నశాంతి బంధుసమాగమము నాయురారోగ్యభాగ్యంబు లచలలక్ష్మి
      నిత్యమంగళములు రామణీయవిభవ, మఖిలసంతోషములు కామితార్థఫలము
      లంది పిమ్మట రంగమందిరాంఘ్రి, సారసరసప్రభావులై మీరగలరు.
క. అని వ్యాసు లానతిచ్చిన, యనువున సూతుండు శౌనకాదిమునులతో
      వినుపించిన నవ్వలికథ, వినవేడుక యయ్యె ననిన వినుడని పలికెన్.
శా. కళ్యాణార్థివినోదిఖండితమహాకాలాగ్రకోదండ కౌ
      సల్యాజాకరమౌక్తికామరమునీశశ్రేణికాజన్మసా
      ఫల్యాకారధురీణ మౌనివరశాపప్రాప్తపాషాణతా
      హల్యానూత్నపునర్భవీకరణపాదాంభోజరేణుప్రజా.
క. శేషాచలనాయక పు, త్రీషణదారీషకనకరేషణదూరా
      న్వేషితపదాబ్ద త్రిభువన, పోషణతత్పర వినమ్రపుణ్యప్రవరా.
సుగంధి. ఆదితేయ పాకశాసనాబ్జభూతి వామదే
      వాది మౌళిరత్న భాసురాంఘ్రివారిజద్వయీ
      నాద బిందుసత్కళాసనాథ యోగయోగిహృ
      త్పాదదుర్లభప్రకర్షవర్ణితాత్మనిగ్రహా.

గద్యము
ఇది శ్రీవేంకటేశ్వరవరప్రసాదాసాదితచాటుధారానిరాఘాటసరసచతుర్విధ
కవిత్వరచనాచమత్కార సకలవిద్వజ్జనాధార కట్టహరిదాసరాజగర్భాబ్ధి
చంద్రవరదరాజేంద్రప్రణీతం బైన గారుడపురాణశతాధ్యాయి
శ్రీరంగమాహాత్మ్యం బను మహాప్రబంధంబునందు
నవమాశ్వాసము