పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 29



ఎటు లోర్వ నున్నవో యీకన్నె చన్నులు
గోపసింహుని గోటి గుమ్ములకును
ఎటు లాన నున్నవో యీతన్వి లేఁదొడల్
చాణూరహరుమారుసాదనలకు
ఎటు లాగ నున్నదో యీనాతి నునుమేను
దంతిమర్దనుకౌఁగిలింతలకును
తే. నంచుఁ దను గేలి యొనరించు మించుఁబోండ్లఁ
గాంచి తలవంచి సిగ్గుచేఁ గలఁకఁబాఱు
వారిజానన వీనులవద్దఁ జేరి
బుద్ధిగా నిట్టు లను రాధ బుజ్జగించి, 107

సీ. చెలువుండు కౌఁగిటఁ జేర్చినయపు డీవు
గుబ్బల మెలమెల్లఁ గ్రుమ్మవమ్మ
విభుఁడు చెక్కిలి ముద్దు పెట్టినయపు డీవు
నలరుమో వొక్కింత యానవమ్మ
సామి పైకొని రతి సల్పినయపు డీవు
నించుక యెదురొత్తు లియ్యవమ్మ
ప్రాణేశుఁ డలకేళి బడలినయపు డీవు
పురుషాయితము వేగఁ బూనవమ్మ
తే. అతఁడు నవరసరసికశిఖావతంసుఁ
డధికసుకుమారమూర్తి వీ వతని నెటుల
వలచి వలపించుకొనియదో పలికినాను
నాన గొనఁబోకు నామీఁది యాన నీకు. 108

క. అని మనసిజుగమనమ్ములు
విను మని యుపదేశ మిచ్చి వే లె మ్మిదిగో
యెనసెను శుభలగ్నము ప్రియు
నెనయఁగ వలె వేళ తప్పనియ్యక యనుచున్. 109