పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాముఁ డద్భుతదయారసనిరంతరబుద్ది
సోముఁ డంచితకళాసుప్రసిద్ధి
రారాజు భీమవిక్రమనికారస్ఫూర్తి
భోజరాజు కళాప్రభూతకీర్తి
జిష్ణుఁడు వైభవశ్రీవిలాసఖ్యాతిఁ
గృష్ణుఁడు భరతశాస్త్రీయజాతి
తే. ననఁగ నను వొందు బ్రహ్మవిద్యాప్రవీణ
సరస తిరుమల తాతయాచార్యపాద
తోయరుహమత్తచంచరీకాయతాత్మ
పాలితాశ్రితజనుఁడు ముత్యాలు ఘనుఁడు. 27

తే. అట్టి ముత్యాలు ఘనుఁడు తాఁ జెట్టఁ బట్టెఁ
దనకు ననుకూల యగునట్టి ధర్మపత్ని
యౌ నటంచును మానితానూనసుగుణ
పేటి మేటివధూటి శ్రీపోటిబోటి. 28

సీ. శ్రీలక్షణమున లక్ష్మిని సాటి యనవచ్చుఁ
జంచల యై ధాత్రి మించదేని
వైభవంబున శచీవనిత నీ డనవచ్చుఁ
బలుగాకిపుత్త్రులఁ బడయదేని
భూతిపెంపున శైలపుత్త్రి జో డనవచ్చు
విభుమేను సగము గావింపదేని
నిశ్చలక్షమ ధారుణిని సరి యనవచ్చుఁ
బతులను బెక్కండ్రఁ బడయదేని
తే. యనఁగ ననుపమసకలగుణాభిరామ
యగుచు బాంధవజనకోటి యభినుతింప
సొంపు మీఱఁగఁ బెంపెక్కు సంపదాఢ్య
హారిగృహవాటి శ్రీపోటి యవ్వధూటి. 29