పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

బసవపురాణము

క్షారామ్లలవణయుక్తముగ మాంసంబు - సారంబుగా వండి చయ్యన మఱియు
శాకము ల్గావించి సంధిల్లఁబెక్కు - వాకంబు లొడఁగూర్చి భద్రమూర్తికిని
ఆరగింపఁగఁబెట్టునంత నయ్యగ్ర - హారంబు భూసురు లందఱుఁగూడి
గుండులు బడియలు గొని పాఱిపాఱి - యొండొరుఁగడవంగనుద్వృత్తి నరిగి
నఱకుఁడుతలతల్పు లుఱుకుఁడు గుడిసెఁ - బెఱుకుఁడు భోగయ్యఁబఱవుఁడు వెదకి
పట్టుఁడు దల వచ్చిబడియలఁబగులఁ - గొట్టుఁడు మాదిఁగకొయ్యఁబోనీక
నగ్రహారంబు గాదయ్యె నిట్లనుచు - నాగ్రహంబున విప్రులందఱుఁబలుక
హరమూర్తియును నంతనట్లదృశ్యముగ - వరకీర్తి భోగిదేవయ్య గోపించి
యంత్యజు లంత్యజు లని యఱచెదరు - అంత్యజులకుఁజొర నది యెట్లువచ్చు
నరుదుగ మీయట్టి యగ్రజన్ములకు - హరభక్తులిండులు సొరఁగరా దనిన
నిటలాక్షభక్తుల నిందించి మీకుఁ - బటురౌరవము లందఁబ్రాప్తియే చెపుఁడ
కూడదు శివదూషకుల మిమ్మునంటఁ - [1]జూడఁగఁబ్రతిమాటలాడఁగావునను
ఖలులార! యిండ్లువృత్తులు నూరు మీరు - తలఁ [2]గట్టికొనుఁడు మాదాతలు మేముఁ
బోయెదమనుచు నబ్భోగయ్యవెడలి - యాయూరి మునిమంద కరుగ నయ్యెడను
శైవులయిండుల శైవలింగములు - దేవాలయములు ప్రతిష్ఠలింగములు
నమితస్వయంభు లింగాదిలింగములు - తమతమ సింహాసనములను విడిచి
తలుపులు వడనూకి తారు లింగములు - జలదారిగాఁదూఱి చనులింగములును
పూవుఱా వడనూకి పోవులింగములు - బావి నదృశ్యమై పఱచులింగములు
కలయ నంతంత గంతులువైచివైచి - యలరుచుఁజెలఁగుచు నరుగులింగములు
[3]నురవడి వట్రిల్ల నొండొంటిఁ గడవఁ - బరువడిఁదమకించి పాఱులింగములు
నెల్లవారును జూడ నిలమీఁద నొక్క - నల్లేటిపొడవున డొల్లు లింగములు
ఖేచరత్వమున నేఁగెడు లింగములను - భూచరత్వంబునఁబోవులింగములు
ననిలవేగంబున నరుగులింగములు - చనలేక మెల్లన చనులింగములును
నీ విధంబునను గెంబావిలింగములు - భావించి భోగయ్యపజ్జనె యరుగ
లింగపర్వత మేఁగులీలఁబొల్పార - లింగభక్తాలి గేలికలు సేయుచును
నాడుచుఁబాడుచు నరుగ నిక్కడను - బాడువాఱెను బురిభాగ్యంబు దొలఁగె
నవని గంపించె సస్యావలులెండె - భువివృక్షములు వ్రాలెఁబొడిచెఁజుక్కలును

  1. జూడఁగాఁబ్రతిమాటలాడఁగారాదు
  2. బొడ్చు, నడ్చు
  3. ఉరువడి