పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

బసవపురాణము

విశిష్టాద్వైతులవలె వీరును శ్రౌతస్మార్తకర్మలతో సమానముగా నా(శైవా)గమోక్తము లయిన కర్మములను గూడ నాచరింతురు. [1]

కాలాముఖులు

వీరి సిద్ధాంతమేదో స్పష్టముగాఁ దెలియరాదు. కాని, వీరు శక్తిపూజనుగూడఁ జేయువారుగాఁ దెలియవచ్చుచున్నారు. మండలార్చనాదులు శాక్తసంప్రదాయములు గొన్ని వీరికిఁ గలవు. లింగార్చనము శక్తిశివసంయోగరూప మయినదే. శక్తిచిహ్నము పానవట్టము, శివచిహ్నము లింగము నగును. శక్తిరహితుఁడగు శివుఁడు చేష్టింపఁజాలడనియు, శక్తిసహితుఁడగు శివుఁడే సర్వశక్తుఁడనియుఁ బ్రాచీనశైవసిద్దాంతము. ఈ విషయమునే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో 'శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం - నచే దేవం దేవో న ఖలు కుశలస్స్పందితు మపి' అని చెప్పిరి. మఱియు జీవాత్మ శక్తిపీఠమనియుఁ, బరమాత్మ లింగమనియు, లింగపీఠములు జీవాత్మైక్యబోధకములనియు నాగమములందుఁ గలదు : జీవాత్మ శక్తిపీఠం స్యాత్ పరమాత్మాతు లింగకమ్'. కాలాముఖులు శక్త్యర్చనముగూడఁ గావింతురు. వారు నిత్యబ్రహ్మచారులు. గార్హస్థ్యము వారికిఁ దగదు. నన్నిచోడని కుమారసంభవమునఁ గాలాముఖ శైవసంప్రదాయములు కొన్ని గాననగును.

పాశుపతాదులు లింగధారులు గారు

దేవలకులు మంత్రదీక్షాన్వితులును
శైవపాశుపతాది శాసనధరులు

  1. వేదో౽పి శివాగమ ఇతి వ్యవహారో యుక్తః, తస్య తత్కర్తృత్వాత్; అతశ్శివాగమో ద్వివిధః, త్రైవర్ణకవిషయస్సర్వవిషయ శ్చేతి; వేద స్త్రైవర్ణిక విషయః, సర్వవిషయ శ్చాన్యః, ఉభయో రేక ఏ ఈశాన స్సర్వవిద్యానామ్... అతః. కర్తృ సామాన్యా దుభావప్యేకార్థపరం ప్రభామాణమేవ. - శ్రీకంఠభాష్యమ్.