పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాచీన హిందూస్థానమున గ్రామ పంచాయతులు

63


మనము జ్ఞాపకముంచుకోవలెను. వారి రాజులుగాని, పాలకులుగాని అక్రమముగా ప్రవర్తించుటకు వారు సమ్మతించలేదు. ఒక వేళ అక్రమముగా ప్రవర్తించినచో అట్టివారిని పదభ్రష్టులను చేయుచుండిరి. సాధారణముగా రాజులు క్షత్రియ వర్ణస్థులై యుండెడివారు. ఒక్కొక్కప్పుడు యుద్దతరుణములందును, కష్టకాలములందును తక్కువవర్ణస్థుడగు శూద్రుడు సైతము స్వసామర్థ్యముచే రాజు కావచ్చును. కాలము గడచినకొలది ఆర్యులు క్షీణదశకు వచ్చిరి. వర్ణవిభాగము మార్పుచెందుటకు వీలులేకుండ కర్కశమయ్యెను. అనేకవిభాగము లుదయించుటచే దేశము బలహీనమై పతనమయ్యెను. ఇదివరలో వారవలంబించిన స్వేచ్ఛనుగూర్చిన భావములుకూడ అంతరించెను. ఆర్యు డెన్నడును బానిసకాడనియు, ఆర్యనామమునకపకీర్తికలిగించుటకన్న చావు మేలనియు వెనుకటి రోజులలో చెప్పుచుండెడి వారు,

ఆర్యుల వలసలు, పట్టణములు, పల్లెలు ఒక క్రమపద్ధతి ననుసరించి నిర్మింపబడినవి. రేఖాగణితము ననుసరించి యీ పద్దతు లున్నవని చెప్పిన నీ వాశ్చర్యపడుదువు. రేఖాగణితము ననుసరించి యంత్రములు వేసి వేదకాలమున పూజించుచుండెడువారుకూడ. నేడుకూడ హిందూగృహములు పెక్కింటిలో ఇట్టి యంత్రపూజలు జరుగుచున్నవి. గృహనిర్మాణమునకును, పట్టణ నిర్మాణమునకును రేఖాగణితము దగ్గరి సంబంధము కలగియున్నది. ప్రాచీనార్యుల గ్రామము బహుశా ఒక దుర్గమైయుండెడిది. అప్పుడు శత్రుభయ మధికము. శత్రుభయము లేనప్పుడు సైతము నిర్మాణపద్ధతిలో మార్పురాలేదు.

ఒక సమచతురస్రము, దానిచుట్టును ప్రహరీగోడలు, నాలుగు పెద్ద ద్వారములు, నాలుగు చిన్న ద్వారములు – ఇది వారి పద్ధతియై యుండును. గోడలమధ్య ప్రదేశమున ఒక క్రమమున వీథులును, ఇండ్లును ఉండును. గ్రామమధ్యమున పంచాయతీగృహ ముండును. గ్రామ పెద్ద లీ గృహమందు సమావేశమగుచుందురు. చిన్న గ్రామములలో