పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

ప్రపంచ చరిత్ర


పత్రిక చదువుటవల్ల నామనస్సులో పుట్టిన సందేహమువల్ల అమ్మను తలచుకొని వ్యాకులపడుచున్నాను. ఆమె ధీరురాలు: ఆడుసింహముహృదయమువంటి హృదయమామెది. కాని యామె దుర్బలశరీర . ఆమెశరీరము మరీ దుర్బలమగుట నా కనిష్టము. మనమెంత వజ్రహృదయులమైనప్పటికి, మన శరీరములు దుర్బలముగా నున్నప్పుడు మనమేమి చేయగలము ? ఏ కార్యమునై నను చక్కగా చేయవలెనన్న మన కారోగ్య ముండవలెను. బల ముండవలెను. దృఢకాయము లుండవలెను. -

అమ్మను లక్నో పంపించుదురట. అది మంచిదే యని తోచుచున్నది. అక్కడ ఆమెకు సదుపాయము లెక్కువగా ఉండవచ్చును. సుఖముగా ఉండవచ్చును. లక్నో చెరసాలలో సహచరులు కొంద రుందురు. మలక్కాలో ఆమె బహుశా ఒంటరిగా నున్నదికాబోలు. అయినప్పటికిని ఆమె దూరముగా లేదుగదా యని యనుకొనుట సంతోషకరము. మా చెరసాలకు నాలుగైదు మైళ్ళదూరములోనే ఆమె వుండుట. కాని ఇది తెలివితక్కువభ్రమ. రెండు చెరసాలల ఎత్తుగోడలు మధ్యగా నున్నప్పుడు 5 మైళ్లైనను 150 మైళ్లైనను ఒక్క టే,

తాత అలహాబాదుకు తిరిగివచ్చినారనియు, కులాసాగా ఉన్నారనియు విని సంతోషించితిని. మలక్కా చెరసాలలోఉన్న అమ్మను చూచుటకు వెళ్ళినారనికూడ విని చాల సంతోషించితిని. బహుశా రేపు, అదృష్టమున్న. మిమ్మందరిని చూడగలను. రేపు నాకు సమావేశదినము. ములాకత్‌కాదీన్ చెరసాలలో గొప్పరోజు. తాతను చూచి రెండునెలలయినది. తాతనుచూచి, నిజముగా కులాసాగా ఉన్నది లేనిది తెలిసికొందును. పక్షముదినములైనవి నిన్ను చూచి. ఇంత దీర్ఘకాలమైన పిమ్మట నిన్ను చూడగలను. అమ్మవర్తమానమును, నీవర్తమానమును అప్పుడు నీవు నాకు చెప్పుదువుకానిలే !

అయ్యో ! ప్రాచీనచరిత్రనుగూర్చి నీకు వ్రాయుటకు కూర్చుండి చిల్లరవిషయములమగూర్చి వ్రాయుచున్నాను. వర్తమానమును ప్రస్తుతము మరిచిపోదము. 2000, లేదా 3000 సంవత్సరముల వెనుకకు పోదము.