పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiii

దక్షిణాఫ్రికాలో లభించిన విజయానికి, అక్కడికి వెళ్ళిన భారతీయులు ఎలా వెళ్లారో అలా వుండి పోవడమే కారణమని కొందరనవచ్చు. అది పూర్తి అజ్ఞానంతో అనేమాట దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ పోరాటం సాగించి యుండకపోతే, దక్షిణాఫ్రికానుంచేగాక బ్రిటిష్ అధీనంలో వున్న యితర దేశాలన్నింటి నుంచి భారతీయులు యింటికి రావలసిన పరిస్థితులు ఏర్పడి యుండేవి వారిని ఆదుకునే నాధుడు వుండేవాడు కాదు. అయితే నా యీ సమాధానం సంతృప్తి కలిగించదు. సత్యాగ్రహపోరాటం జరిపి యుండకపోతే, ఏదో విధంగా నచ్చచెప్పి తృప్తి పొంది యుంటే యీనాడు దక్షిణాఫ్రికాలో వుంటున్న భారతీయులకు పట్టిన స్థితివారికి పట్టియుండేది కాదని కొందరు అనవచ్చు. యిది కూడా సరియైన అభిప్రాయం కాదు. అనుమానాలకు, అపోహలకు తావుయిస్తూ పోతే ఏది అనుమానమో, ఏది నిజమో తెలుసుకోవడం కూడాకష్టమే అనుమానించే అధికారం అందరికీ వుంది. కాని ఒక్క సూత్రం మాత్రం నిజం ఏ ఆయుధంతో ఒక వస్తువును జయిస్తామో, ఆ ఆయుధంతోనే అవస్తువును రక్షించగలం అనునదే ఆ సూత్రం

కాబే అర్జున్ లూటియో వహీ ధనుష్ , వహీబాన్||

ఏ గాండీవంతో అర్జునుడు శివుణ్ణి ఓడించాడో, ఏ గాండీవంతో అర్జునుడు కురుక్షేత్రంలో కౌరవుల మదం అణిచాడో, ఆ గాండీవంతో ఆ అర్జనుడు కృష్ణునివంటి సారధి లేని తరుణంలో దోపిడీ దొంగల ముఠాను ఓడించలేకపోయాడు. దక్షిణాఫ్రికాలో గల భారతీయులస్థితి కూడా యిదే. యిప్పటికీ వాళ్లు పోరాటం సాగిస్తున్నారు. అయితే ఏ సత్యాగ్రహశక్తితో వాళ్లు గతంలో విజయాలు సాధించారో, ఆశక్తిని పోగొట్టుకుకుంటే చివరికి పందెంలో వాళ్లు ఓడిపోతారు. సత్యాగ్రహం వారికి సారధిగా పని చేసింది. ఆసారధియే పోరాటంలో వారికి సాయం చేయగలుగుతుంది.

నవజీవన్ - '5-7-25

మో. క. గాంధీ