పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0117-1 ముఖారి సంపుటం: 07-097

పల్లవి:
ఇల్లురికి పేరటములేల చెప్ప వచ్చేవే
పల్లదాన నీవుఁ గొంత పైకొసరా

చ.1:
వలపులు చవియంటా వంతులకుఁ గొసరేవు
చెలి యీ విభుఁడు పెట్టుఁజెట్టా నీకు
కలికి నీ కొద్దివారా కాచుకున్నారిక్కడను
నెలకొని భోగించ నీయంత నేరరా

చ.2:
నవ్వులే కలవంటా నంటునఁ దొడెక్కేవు
పవ్వళించి యీ విభుఁడు బాడిగెవాఁడా
జవ్వనులిక్కడివారు జాలిరొప్పనున్నారా
చివ్వన నీవలె సేవ నేయనోపరా

చ.3:
కావరాన నీవు గూడి కౌఁగిటనే పిసికేవు
శ్రీ వేంకటవిభుఁడు చిమ్మిలిబొమ్మా
యీవేళనే మమ్మిందరి నితఁడిట్టే కూడినాఁడు
వేవేలకు నీవంటివేడుకలే కావా