పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0115-6 ఖైరవి సంపుటం: 07-090

పల్లవి:
పంతమునేనాడుకొన్నాఁ బలుమారు మెచ్చేవు
యెంతవాఁడ వింత సేసే విట్టిదివో వలపు

చ.1:
పచ్చిమాటలాడితేను భావమెల్లాఁ గరఁగేవు
హెచ్చుకుందులాడినా యియ్యకొనేవు
కచ్చుపెట్టి జంకించితే కాఁగిటనె పొదిగేవు
యిచ్చితివి చనవులు యిట్టిదివో వలపు

చ.2:
చెక్కు నొక్కి పలికితే చెమరించేవు మేనెల్లా
వొక్కటై గోరనూఁదినా నోరిచేవు
మొక్కలాననలిగితే మోహము పైఁజల్లేవు
యెక్కడాను నన్నుఁ బాయవిట్టిదివో వలపు

చ.3:
మొగము నేఁజూచితేనే ముచ్చటతో భ్రమసేవు
అగడుగా నేఁగూడినా నందుకోపేవు
తగిలి శ్రీ వేంకటేశ తమితో మన్నించితివి
యిగిరించేవు పై పై నె యిట్టిదివో వలపు