పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0115-5 గౌళ సంపుటం: 07-089

పల్లవి:
మఱి యేఁటి సుద్దులు మాపు దాఁకాను
గుఱియైన చేఁతలివె కొల్లలాయను

చ.1:
కాటుక కన్నుల నిన్ను కలికి చూడఁగానే
నాటనుండి నీమేను నల్లనాయను
చీటికి మాటికి నాపె సిగ్గులు పైఁజల్లఁగానె
తేటలుగా నీకన్నులు తెల్లనాయను

చ.2:
బలిమినే వలపుల పదను చల్లఁగానే
పలుమారు నీ మేను పచ్చియాయను
యెలిమి నీతో నాపె యిచ్చకములాడఁగాను
వెలయ నీమాట వెచ్చి వేవదాయను

చ.3:
అండనుండి పానుపుపైనలిగి కూడినదెల్లా
యెండలాయ నీడలాయనింతలోననే
దండి గోవిందరాజవై దగ్గరి శ్రీ వేంకటాద్రి
కొండపై నన్నుఁగూడఁగా కోరినట్టేయాయను