పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0102-2 సామంతం సంపుటం: 07-008

పల్లవి:
ఇంత సేయఁగఁగదా యీడ వెల వెట్టితివి
కాంతుఁడవు నీవు మాణిక్యమువంటివాఁడవు

చ.1:
మచ్చరించఁగఁ గదా మనసు పట్టఁ దిరిగే
విచ్చకములాడుకంటె యిదె మేలు
కచ్చుపెట్టి బంగారము కరఁగక వన్నెలేదు
అచ్చముగ వోరి నీవు అటువంటివాఁడవు

చ.2:
రాకుండఁగ నీవే నన్ను రతికిఁ బిలిచితివి
యేకమై వుండుటకంటె యిదె మేలు
మేకొని కస్తూరైనా మేదించక యెనయదు
ఆకడ నీవు వోరి అటువంటివాఁడవు

చ.3:
గుట్టుననుండఁగఁ గదా కూడితి శ్రీ వేంకటేశ
యిట్టునట్టు దూరుకంటె యిదె మేలు
చెట్టుమీఁది విరులైనా చేతులఁ గోయకరావు
అట్టెవోరి నీవు అటువంటివాఁడవు