పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0114-5 నాదరామక్రియ సంపుటం: 07-083

పల్లవి:
నీవల్లనె కొత్తగాదు నిండుజవ్వనము గల
కావరపు వారి కెల్లా కలదిదే చాలు

చ.1:
ఏమని మాటలాడెనో యింతి నీతోనల్లప్పుడే
మోమునఁ గళలు దేరీ ముదము తోడ
చేముట్టి నాతోనప్పటి చేరి సరస మాడేవు
ఆమని కాలముగాఁగా నగ్గువాయ వలపు

చ.2:
సన్నలేమి సేసెనో జలజాక్షి నీ కప్పుడు
పన్నిన నీ చిత్తమెల్లా పరాకైనది
మన్నించి అప్పటి నాతో మాటలూనాడేవు
నున్నగానుప్పాలికి యినుమడాయ వలపు

చ.3:
కలసీన రతి యెట్టో కౌఁగిటను మదిరాక్షి
నిలువెల్లాఁ బులకలై నిగ్గుదేరెను
అలరి శ్రీవేంకటేశ అప్పటి నన్నుఁ గూడితి
బలిమిఁ బయిరు సేయఁగ పంటవండె వలపు