పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0114-4 ముఖారి సంపుటం: 07-082

పల్లవి:
అటువంటి సతిఁ గాని యాదరించవు
మటుమాయముల మాటుమందులే నీకు

చ.1:
కాటుక కన్నుల యింతి కందువ చూపులు దాఁకి
నాటుకొని నీ తనువు నల్ననాయను
మేటియై యాపెచెక్కుల మెఱుఁగు కళలు దాఁకి
పాటించి నీకోకయెల్లాఁ బచ్చనాయను

చ.2:
జలజవదనమేని జవ్వనభావాలు సోఁకి
పాలుపొంద నీబొడ్డు పూవక పూచెను
అలర జఘన చక్ర మాపె పొాందుసేయంగాను
తిలకింపఁ జక్రము చేతికి వచ్చెను

చ.3:
పాల వెల్లి కూఁతురుఁ జేపట్టి పెండ్లాడఁగాను
పాల సముద్రము నీకుఁ బడుకాయను
యీలీల శ్రీ వేంకటేశ యిందర మాపె వారమే
వేల సంఖ్యల సతుల విటతనమబ్బెను