పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0102-1 మంగళకౌశిక సంపుటం: 07-007

పల్లవి:
ఏల తలవంచుకొనేరిద్దరును నన్నుఁ జూచి
తాలిమినద్దరిపాటు తగదు నావల్ల

చ.1:
ఇక్కడ నీ వేళ చూడనింతి నంపి మఱికాక
గక్కన నేవచ్చినదే కల్ల నావల్ల
మక్కువ నదియుఁగాక మంచముపై సోదించక
మొక్కళానఁ గూచుండుటె మోసము నావల్ల

చ.2:
అందంద మాటలాడే అలబలము చూడక
కందువఁ దెరదీసుటే కల్ల నావల్ల
దిందుపడూరకుండక దీపమెగసన దొబ్బి
ముందు నేనే నవ్వినది మోసము నావల్ల

చ.3:
ఇన్నాళ్ళవలెనె యంటా నీపెకు వరుసియ్యక
కన్నళవిఁ గూడినదె కల్ల నావల్ల
యిన్నిటా శ్రీవేంకటేశ యిఁకనేల నే నిన్న
మొన్ననే రానిదియెల్లా మోసము నావల్ల