పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0113-6 శంకరాభరణం సంపుటం: 07-078

పల్లవి:
అదియు నాపెద్దిరికమన్నిటాఁ గాదా
పదరినా యిందరును బలఁగమే కదవే

చ.1:
మన్నించే యాతనికిని మఱిఁగొందరు రానీవే
కన్నులెంత పెద్దవైనా కలిమే కదే
మున్నిటి వారి కతఁడు మొక్కులెల్లా మొక్కనీవే
చన్నులెంత పెద్దలయినా జవ్వనమే కదవే

చ.2:
అడఁగి మడఁగి వారికట్టే తా నడచీని
నడుమెంత కొంచెమైనా నయమే కదే
బడిబడిఁ గన్నచోట బాసలెల్లాఁ జేసీని
కడు గొప్ప పిఱుఁదు సింగారమే కదవే

చ.3:
సరికి బేసికిఁ దాను జాణతనాలాడీని
కురులు గూడితేఁ గొప్పు గొప్పాఁగదే
యిరవై శ్రీవేంకటేశుఁ డిందరిలో నన్నుఁ గూడె
వొరసీతే మోవితేనెలూరేవే కదవే