పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0113-2 దేసాళం సంపుటం: 07-074

పల్లవి:
మీఱి వచ్చిన పనికి మీరె సాక్షి
వీఱిడితనము నాకు వీసమంతానున్నదా

చ.1:
తగులనాడినవాఁడు దాఁపిరపు మాటలేలే
నగవులు నగి నాతో ననుచుఁ గాక
బిగిసితేనిఁక నాకు పెలుచుఁ గోపము రాదా
మగువలాల నాయందు మఱి తప్పులున్నవా

చ.2:
తప్పక చూచిన వాఁడు తమకించకుండనేలే
కప్పుర విడెమిచ్చి కలసుఁ గాక
వుప్పతించితే నను వోరుచుకుండఁ గలనా
కప్పుర గందులాల కపటములున్నవా

చ.3:
చేయి పట్టుకున్నవాఁడు సిగ్గులు వడఁగనేలే
యీ యెడనే నాకు మనసిచ్చుఁ గాక
పాయపు శ్రీ వేంకటపతి నన్ను నిటు గూడె
చాయల మగువలాల చలము నాకున్నదా