పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0113-1 పాడి సంపుటం; 07-073

పల్లవి:
ఎరవులేని రమణుఁడితఁడే కదే
ఆరుదై నాకే మోహించునంటిఁ గదరే

చ.1:
ఏతులకు వనితలు యెవ్వరేమి యాడుకొన్నా
నాతఁడు నేనునొక్కటే అంటిఁ గదరే
యీతల రమణుఁడు వారింట నుంటే నుండెఁ గాని
ఆతుమ నాతోఁ జెప్పెనంటిఁ గదరే

చ.2:
వాసికిఁ గొలువులో నెవ్వరిదిక్కు చూచినాను
ఆసలెల్లా నామీఁదివంటిఁ గదరే
బాస యెందో సేసెనంటా భామలు నాతోఁ జెప్పితే
ఆ సుద్ది నేనెఱిఁగినదంటిఁ గదరే

చ.3:
పదరి యాతని మేను పచ్చియ్యై వున్నదంటే
అదియెల్లా నాచేఁతలంటిఁ గదరే
యెదుట శ్రీ వేంకటేశుఁడిదివో నన్నుఁగూడె
అది మీరే తెలుసుకొమ్మంటిఁ గదరే