పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0112-6 నాదరామక్రియ సంపుటం; 07-072

పల్లవి:
ఇయ్యకొంటి గానీవే యిందుకేమి
నెయ్యపు మాటలకెల్లా నెరవాది తాను

చ.1:
చాయ నేనుక వుండితే సంతోషమే కదవే
చేయి మీఁదైన తన చేఁతలకును
మాయలకు లోనైతే మంచి దాననే కదవే
పాయపు మదముతోడి పంతగాఁడు తాను

చ.2:
ఎదురు మాటాడకున్న నింతా మేలే కదవే
కదిసి తానాడేటి కల్లలకును
చెదరక నేనవ్వితే చిత్తము వచ్చుఁగదవే
వెదచల్లే వలపుల వేసదారి తాను

చ.3:
చెప్పినట్టు సేసితేను సెలవాయఁ గదవే
యిప్పుడు గూడె శ్రీ వేంకటేశుఁడు నన్ను
చిప్పిలు మోవి చేకొంటే చింతదిరెఁ గదవే
దప్పికి నెయ్యిదాగేటి తగవరి తాను