పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0101-6 గౌళ సంపుటం: 07-006


పల్లవి:
అందుకే వేగిరమయ్యానప్పటినుండి
గొందికిట్టే రాఁడుసుమ్మీ కొంకు విడిపింతును

చ.1:
తప్పక చూచినవాఁడు దగ్గరి రాఁడు సుమ్మీ
కప్పురము నోరికిచ్చి కౌఁగిలింతును
అప్పుడె నవ్వేటివాఁడు ఆయములంటఁడు సుమ్మీ
చిప్పిల మెయి చెమరించఁ జేతును

చ.2:
చేకొని మాటాడేవాఁడు చెఱఁగు వట్టఁడు సుమ్మీ
దాకొనఁ బెదవిని ముద్రలు వేతును
యీకడ నింతటివాఁడు యెదురుపడఁడు సుమ్మీ
లోకమెల్లా మెచ్చనిట్టే లోఁగొందును

చ.3:
కాఁకలు చల్లేటివాఁడు కందువ దీర్చఁడు సుమ్మీ
మాఁకువలె మేనెల్లా మఱపింతును
యేఁకటతో శ్రీవేంకటేశుఁడిట్టి నన్నుఁ గూడె
వూఁకొనఁడు సుమ్మీ పంతాలొప్పగింతును