పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0112-2 శ్రీరాగం సంపుటం; 07-068

పల్లవి:
చెప్పినట్టు సేయవే చెలువునికి
కప్పురము దిన్ననోటఁ గడు దప్పిగలదా

చ.1:
చలమెంత గలిగినా సతులకుఁ బతితోడ
కొలచి కూరిమి చల్లి కొసరేదే
బలిమి సేసీనతఁడు పట్టిపెనఁగనేల
యెలమినీఁతకు మిక్కిలిఁకలోఁతు గలదా

చ.2:
బింకమెంత గలిగినా ప్రియురాండ్లు విభునితో
వంకలొత్తి మరిఁగొంత వలపించేదే
లంకెలకుఁ బొదిగితే లావులు చూపఁగనేల
వుంకువపట్టినమీఁద నొడఁబాట్లున్నవా

చ.3:
సిగ్గులెంత గలిగినా శ్రీ వేంకటేశుతో నీవు
బిగ్గెఁ జన్నులొత్తి కూడి బిగియించేదే
దిగ్గనఁ గలసె నింక దేవునికి మరఁగేల
దగ్గరి మోములుచూచి తలపోఁతలున్నవా