పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0112-11 శుద్దవసంతం సంపుటం: 07-067

పల్లవి:
ఎఱుఁగుదుమిఁక మమ్ము నేల రేఁచీనే
మఱవమెపుడునివి మనసులోననవే

చ.1:
తన నగవులె కావా తరుణులకెల్లాను
చెనకేవేళ ముత్యాల నేసలైనవి
పనివడి తనచేతి పచ్చిచేఁతలె కావా
ఘనమై మరుచావడికళలు దించేవి

చ.2:
నేటిమాటలె కావా నెలఁతులకెల్లాను
మాటులేని వలపుల మందులైనవి
కోటి సేయ తానడవచే గుణములివె కావా
పాటించి రతియాసల బంతి సాగించినవి

చ.3:
చూపులివియె కావా సూటులై మాబోంట్లకు
రేపుమాపు కడుఁబెరరేఁపులైనవి
యేపున శ్రీ వెంకటేశుఁడిదె తానె మమ్ముఁగూడె
తీపుల మోవికెంపుల తిద్దుబడియైనవి