పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0111-6 శంకరాభరణం సంపుటం: 07-066

పల్లవి:
ఔదువే దొడదానవందరిలోన
సాదువలెనే యితని సాదించను

చ.1:
తపము సేసితివే తరుణి నీరమణుఁడు
యెపుడు నీవద్దనుండి యిచ్చలాడును
వుపమనేరుతువె వొద్దికతోనాతఁడు
కపురుగా నవ్వు నవ్వి కరఁగించును

చ.2:
అన్నిటా జూణవె నీవు అంగవించి నాయకుని
పన్నిన మాటలఁ బెట్టి భ్రమయించను
సన్నల గెలిచితివే చాయల చూపులు చూచి
వన్నెల నీతని నింత వలపించను

చ.3:
చెల్లునె యెప్పటివలె శ్రీ వేంకటేశ్వరుని
మెల్లనె కౌఁగిటంగూడి మెప్పించను
తల్లివె మాకెల్ల నీవు తగు నీకు చెలులము
అల్లిదామెరలై నీవాతనిఁ జొక్కించను