పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0111-1 లలిత సంపుటం: 07-061

పల్లవి:
దక్కె నీకుఁ బంతము తగిలినప్పుడె నేము
మొక్కితిమిట్టె నీతో మొక్కలములొల్లము

చ.1:
కూరిమినైనాఁ గాని కోపాననైనాఁ గాని
వూరకే నిమోము చూడకుండలేమురా
చేరి యిట్టె పట్టరాని చిత్తమువారము నేము
యేరీతినైనాం జేయుమిఁకనేల మాటలు

చ.2:
తత్తరానకైనాఁ గాని తగవునకైనాఁ గాని
వొత్తి నిన్నుఁ బిలువక వుండలేమురా
చిత్తిణిగుణాన నీకే చిక్కినవారము నేము
వుత్తరువు నీకునిదె వొద్దనే వున్నారము

చ.3:
నగవునకైనాఁ గాని నాటకానకైనాఁ గాని
వొగి నిన్నుఁగూడక వుండలేమురా
చిగురుఁబాయమునాఁడే సేసవెట్టితిమి నేము
మిగుల శ్రీ వేంకటేశ మెచ్చితి నిన్నిపుడు