పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0101-5 శ్రీరాగం సంపుటం; 07-005

పల్లవి:
ఆదట దయదలఁచి యాదరించినంతె చాలు
సోదించి యాతని నంత జోలిఁబెట్టఁ జాలను

చ.1:
చనవు మెఱయఁబోతే స్వతంత్రము చూపవలె
మనవి చెప్పఁగఁబోతే మారు మాట్లాడవలె
ననుపు నడపఁబోతే నగి మందెమేళమౌను
ఘనుఁడాతనికి నేనింత గాసిఁబెట్టు నోపను

చ.2:
బలిమి సేయఁగఁబోతే పట్టి పెనఁగఁగవలె
చలము సాధించఁబోతే జంకించవలె
అలిగి సాలయఁబోతే అన్నియునుఁ దలఁపౌను
చెలువుఁడాతనినంత చిమ్మిరేఁచనోపను

చ.3:
మేలములాడఁగఁబోతే మీఁదఁ జెయివేయవలె
నాలిమొగదాకిరైతే నాయంత నేనుండవలె
ఈలీల శ్రీ వేంకటేశుఁడింతలోనే నన్నుఁగూడె
ఆలరి యాతనినంత అలయించనోపను