పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/597

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0200-5 తెలుఁగుకాంబోది సంపుటం: 07-595

పల్లవి:
అదె తాఁదానే కదవే అంగన వీఁడు
వెదకి యెందు చూచిన వీఁడేవాఁడు

చ.1:
కలలో వచ్చినవాఁడు కప్పురమిచ్చినవాఁడు
చెలఁగేటి వురముపై చెలియవాఁడు
తెలిసి మేలుకొంటేను దేవరవలెనున్నాఁడు
వెలుపలఁ దానె యై వీఁడేవాఁడు

చ.2:
నిక్కిచూచినట్టివాఁడు నిన్నటిమొన్నటివాఁడు
తక్కక తులసిపెద్దదండలవాఁడు
పక్కనఁ బేరుకొంటేను పలికీ నిప్పుడే వీఁడు
వెక్కసపు నవ్వులతో వీఁడేవాఁడు

చ.3:
అడుగనంపినవాఁడు ఆయములంటినవాఁడు
కడలేని శ్రీ వెంకటప్పవాఁడు
అడియాలముగఁ గూడెనంతలోనిప్పుడు వీఁడు
విడువని మహిమల వీఁడేవాఁడు