పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0199-6 రామక్రియ సంపుటం: 07-590

పల్లవి:
మేలు మేలు రాఁగా రాఁగా మేటివైతివి
వాలుఁజూపులఁ జూచితే వచ్చెఁగా పని

చ.1:
చెంతనాతఁడు నీచెలిసేవలకు మెచ్చితేను
యింతమాట యెంతసేసేవిదిగో నీవు
సంతతమునాపె గన సరసములాడితేను
వంతులకు నీచెత వచ్చెఁగా పని

చ.2:
నీవు పిలువనంపిన నెలఁతకు సొమ్ములిచ్చే
యీవిలోనే వావిగట్టేవిదిగో నివు
కావలెననుచు నాపె కాఁగిలించుకొంటే గన
వావాత నీచేతనే వచ్చెఁగా పని

చ.3:
పాదాలొత్తే పడఁతిపై పచ్చడముకొంగువడె
నాదరించి కూడెననేవంతలో నీవు
యీదెస శ్రీ వెంకటేశుఁడెనని నిన్నిఁక నాపె
వాదొద్దని మొక్కించెను వచ్చెఁగా పని