పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0199-4 ఆహిరి సంపుటం: 07-588

పల్లవి:
ఈయెడనేమిసేసినా నేమనే నీచిత్తము
కాయకపుఁ జేఁతలెల్లఁ గప్ప వచ్చేనా

చ.1:
యెగసక్యాలకు నీవు యేమని పొగడినాను
జగడాలకు వచ్చేనా సారె నీతోను
తగవులు దప్పి నీవు తమకించి మొక్కి తేను
తెగడి నిన్నిఁక వేరే తిట్టవచ్చేనా

చ.2:
నాటకాలనూరకే నవ్వులెంత నవ్వినాను
ఆటకానఁ గన్నుల నిన్నదలించేనా
జూటరితనాల నన్ను సుద్దులెన్నియడిగినా
మాటలు వెలుచుకొని మచ్చరించేనా

చ.3:
వేసాలకు నీవెంత వేడుకఁ గాఁగలించినా
ఆసపడి నిన్ను నేను ఆయాలంటేనా
రాసికెక్క శ్రీ వెంకటరమణ నన్నుఁ గూడితి
బాసదప్పెనంటా నిన్నుఁ బచ్చిసేసేనా