పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0190-3 పాడి. సంపుటం: 07-587

పల్లవి:
రమణులము నేమింత రవ్వకోపేమా
చెమరించీని మొకము చేరి విసరినాను

చ.1:
మచ్చిక మీఁదఁ గల మగువలకెల్లాను
యిచ్చకమే సేయవలె నెక్కడా నీకు
యెచ్చుకుందులైన మాటలేమీనాడఁగరాదు
పచ్చిదేరిని పనులు భావించి చూచినను

చ.2:
పెట్టిన శాసల నీ ప్రియురాండ్రెల్లాను
గుట్టుతోడనుండవలెఁ గోరి నీవద్ద
చిట్టకాలు సేయరాదు చింతతోనుండఁగరాదు
వొట్టుకొనె వానలెల్లా వొరసిచూచినను

చ.3:
కూడిన నీకూటములకోమలులకెల్లాను
తోడునీడై యుండవలె తొరలి నీకు
జాడతో నన్నుఁగూడితి సాదించరాదు నిన్ను
వోడక శ్రీ వెంకటేశ వొద్దికైతివిపుడు