పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0199-2 దేసాళం సంపుటం; 07-586

పల్లవి:
గుట్టుననుండఁగరాదా కొంతకొంతైనా
ఱట్టులు సేయఁబోతే నాఱడిఁ బడుఁ బనులు

చ.1:
ఆమనికాలము డొల్లే ఆయాలు పైపైనున్నవి
చేముట్టి సరసాలేలే చెల్లఁబో నీకు
గామిడివాఁడాతఁడు కప్పురపుమోవి నీది
వేమారు మాటాడఁబోతే వెల్లవిరౌఁబనులు

చ.2:
సిగ్గులకాలము దొల్లే చెక్కులు చేతనున్నవి
దగ్గరియాకతాలేలే తరుణి నీకు
బగ్గడికాఁడాతఁడ పంతకత్తెవు నీవైతే
వెగ్గళించఁ జూచితేను వింతదోఁచుఁ బనులు

చ.3:
ముచ్చటకాలము దొల్లే మోహము లోననున్నది
పచ్చిదెర నవ్వనేలే పదరి నీకు
యిచ్చట శ్రీ వెంకటేశుఁడీతఁడిట్టె నిన్నుఁగూడె
యెచ్చరికె లేకుంటే యేమౌనో పనులు