పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0198-6 బౌళి సంపుటం: 07-584

పల్లవి:
చేసిన తనచేఁతలు చెప్పరాదు
యీ సటలవానితోడ నేమిసేతునే

చ.1:
వలపు గలవారికి వాసులు పనికిరావు
పిలిచితేఁ బలుకక బిగియరాదు
చలపట్టి వేఁడుకొంటే సమ్మతించకుండరాదు
యెలయించీనిదె తాను యేమిసేతునే

చ.2:
మన్ననగలవారికి మంకులు చూపరాదు
సన్నలేమి సేసినాను సాదించరాదు
కన్నులనే నవ్వినాను కాఁతాళము చూపరాదు
యిన్నేసి ప్రియాలు చెప్పీ నేమిసేతునే

చ.3:
కూటమిగలవారికి కోపగించు కొనరాదు
పాటించి మేలమాడఁగఁ బదరరాదు
గాఁటమై శ్రీ వేంకటఘనుఁడిట్టె నన్నుఁగూడె
యీటువెట్టెఁ దనతోడ నేమిసేతునే