పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0197-1 సామంతం సంపుటం; 07-573

పల్లవి:
నంటున నీ చేఁతలకు నవ్వే నేను
వెంట వెంట నీగుణాలు వెల్లవిరి ఆయను

చ.1:
పిలిచి నీవు నాతోఁ బెనఁగి బాఁతిపడఁగ
నెలమి నే మారుత్తరమియ్యఁ గాక
కలసిన నీసతుల కాలిగోరఁ బోలుదునా
నిలిపిన నీమహిమ నీవే యెరుఁగుదువు

చ.2:
పక్కన నీవు నాపైఁ జెయ్యి వేయఁగాను
చిక్కిలోనై నీసేవ సేసేఁ గాక
చక్కని నీయింతులతో సరిపెనఁగఁ గలనా
మిక్కిలి నీచెల్లుబడి మెరయించేవిప్పుడు

చ.3:
కందువఁ గూడిననన్ను కాఁగలించుకొనఁగాను
పొంది నిన్నునన్నిటా బోగించేఁ గాక
సందడి శ్రీ వెంకటేశ సమరతికర్హమా
యెందు నీమన్ననలనింత సేసేఁ గాక