పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/574

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0196-6 ముఖారి సంపుటం: 07-572

పల్లవి:
చెప్పవద్దు నీలాగు చెలులెరఁగనిదా
ముప్పిరి నీవు వెనకముందెంచేవాఁడవా

చ.1:
వూరటగానందరిని వొకరొకరినే పట్టి
పోరుదీరఁ బొద్దునను భోగించితివి
యీరీతి నెవ్వతెవద్దకేఁగవలశొ కాక
పౌరసతులపై నింత బత్తిగలవాఁడవా

చ.2:
వొగ్గి నీవే పిలిపించి వూరివారినెల్లాను
సిగ్గుదేర లోలోనే చెనకితివి
యెగ్గులేక యవ్వెతె నీయింటికి రాఁగానో కాక
నిగ్గుల నింత మోహము నించేటివాఁడవా

చ.3:
యిల్లిల్లు దప్పక చొచ్చి యింతియైన దానినెల్లా
కొల్లదీర నొక్కమాటే కూడితివి
యిల్లిదె నన్ను శ్రీ వెంకటేశ కూడేకొరకుఁగా
యెల్లవారిమేకులకు నింత చిక్కేవాఁడవా