పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0196-5 బౌళి సంపుటం: 07-571

పల్లవి:
దీనికేమి దోసమా తగిన గేస్తురాలవు
నేను నిన్నునేమనేను నీకేలే సిగ్గులు

చ.1:
కొండవంటి దొర నిన్ను కొంగువట్టి తీసితేను
వొండేమీననలేక వొద్దికైతివే
అండనుండి సారెసారె నాతఁడే పిలువఁగాను
బండుబండు గాలేక పలికితివే

చ.2:
చక్కని జాణఁడు నీ జవ్వనము దడవఁగ
గక్కన విడువలేక కైకొంటివే
వెక్కసానఁ గమ్మటిని వీడె మాతఁడియ్యఁగాను
అక్కరఁ దోయలేక అందుకొంటివే

చ.3:
శ్రీవెంకటేశ్వరుఁడు చెక్కు నిన్ను నొక్కఁగాను
కైవశమై అంతలోనఁ గరఁగితివే
యీవేళ నన్నేలి వచ్చె నిద్దరి సవతులఁగా
కావించి నవ్వితి నిట్టే కదిసితివే