పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0196-3 లలిత సంపుటం: 07-569

పల్లవి:
ఎవ్వరితోఁ జెప్పరాదు యీసుద్దులు
నివ్వటిల్ల నాతోను నీవే ఆనతియ్యవయ్య

చ.1:
కన్నులనే కొసరను కాఁకలు విసరను
వున్నదాన నీయెదుట వూరకే నేను
సన్నలు సేసేవు నీవు సంగతేమి దెలియదు
పిన్నదాన యాకతానఁ బిలిచి ఆనతీవయ్యా

చ.2:
పక్కన వేసరించను పంతాన నోసరించను
వొక్కటై కాచుకుందాన వొద్దనే నేను
మొక్కులు మొక్కేవు నీవు ముందువెనకెరఁగను
చిక్కితి నీవలపులఁ జేరి ఆనతీవయ్యా

చ.3:
చలములు సాదించను సారెసారె బోదించను
కొలఁది మీరఁగ నిన్నుఁ గూడితి నేను
బలిమి శ్రీ వెంకటేశ పైకొంటివి నన్నునిట్టె
తలఁపు నీవెరఁగవా తగ నానతీవయ్యా