పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0196-2 సాళంగనాట సంపుటం: 07-568

పల్లవి:
ఎటువంటివాఁడవు యెంతమెత్తనివాఁడవు
మటమాయములలోని మరఁగు దెలియవు

చ.1:
మచ్చరించేనా నీతో మనసు చూడవలసి
యెచ్చరికెగా నంటినేమైనను
కొచ్చికొచ్చి పోరేనా కొనగొన చన్నులను
తచ్చనకు నదిమితే తమకించేవు

చ.2:
తప్పువట్టేనా నీ తగవు చూడవలసి
చొప్పులెత్తి నీమేను సోదించితి
వుప్పటించి పెనఁగేనా వుడివోని సరసాన
కొప్పువట్టినంతలోనే కొసర వచ్చేవు

చ.3:
చలపట్టేనా నీవు సారెకు మెచ్చవలసి
కలసి కాఁగిలఁ గూడి కరఁగించితి
బలిమి చూపేనా నీతో పక్కన శ్రీ వెంకటేశ
తెలిపి మోముచూచితేఁ దిట్టువచ్చేవు