పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0110-2 ముఖారి సంపుటం: 07-056

పల్లవి:
ఏఁటికే యూదోసము మీరెఱఁగరటే
ఆఁటదాననింతే నన్ను ఆఱడిఁబెట్టకురే

చ.1:
తామరమొగ్గలవంటి తగిన నాచన్నులివి
కామునియమ్ములనేరు కాంతలిదేమే
నామగనికౌఁగిటిలో ననిచే జక్కవలవి
ప్రేమమున మారుఁబేరు పెట్టుదురటే

చ.2:
చందురునిఁ బోలేటి సరసపు నా మోము
అందపుఁబూబంతియంటానాడుకోకురే
ముందు నారమణునికి మోము చూచేటద్దమిది
కందువలేని నిందలు గడింతురటే

చ.3:
తీగెవంటి నామేను దిక్కుల మెఱుఁగనుచు
పోగులుగా సారెసారెఁ బొగడకురే
బాగుగ శ్రీ వేంకటేశు పానుపుపై చిగురిది
యోగము గూడెను వేరే వుష్పటించనేఁటికే